మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవానికి  నిధులివ్వాలి..రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి: మహేశ్‌ గౌడ్‌ 

మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవానికి  నిధులివ్వాలి..రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి: మహేశ్‌ గౌడ్‌ 
  • విభజన హామీలు నెరవేర్చకుంటే ప్రజలు మిమ్మల్ని ద్రోహులుగా చూస్తారు
  • ప్రధాని మోదీకి పీసీసీ చీఫ్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్, వెలుగు: మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ట్రిపుల్‌ ఆర్‌‌కు నిధులివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కోరారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని కోరుతూ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి 8 కీలక అంశాలను ప్రస్తావిస్తూ, వాటిపై కేంద్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. హైదరాబాద్ సిటీ వేగంగా విస్తరిస్తున్నందున మెట్రో రైలు రెండో దశ విస్తరణకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని కోరారు.

రూ.38,595 కోట్లతో చేపట్టే 122.9 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టుకు జాయింట్ వెంచర్ కింద నిధులివ్వాలన్నారు. అలాగే, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును జాతీయస్థాయి అర్బన్ రివర్ ప్రాజెక్టుగా గుర్తించి, బాపూఘాట్ వద్ద రక్షణ శాఖ భూములకు అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌‌) ఉత్తర భాగానికి ఆర్థిక ఆమోదం తెలపాలని, దక్షిణ భాగానికి వెంటనే అనుమతులివ్వాలని లేఖలో పేర్కొన్నారు. వంద శాతం కేంద్ర నిధులతో రీజినల్ రింగ్ రైలును కూడా చేపట్టాలని, హైదరాబాద్ నుంచి అమరావతి, బెంగళూరుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్​ప్రెస్‌ హైవేలు నిర్మించాలని ఆయన కోరారు.

వాటికి రూ.45 వేల కోట్లు ఇవ్వండి..

ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు నిర్మించే రేడియల్ రోడ్లను జాతీయ అభివృద్ధి కారిడార్లుగా గుర్తించి రూ.45 వేల కోట్ల సాయం అందించాలని మోదీకి మహేశ్‌ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సెమీ కండక్టర్ ప్రాజెక్టులు, ఫ్యాబ్ సిటీకి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు అందించాలన్నారు.

నీటి పారుదల రంగానికి సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘నో అబ్జెక్షన్’ ఇప్పించడంలో కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. దశాబ్దకాలం గడిచినా విభజన చట్టంలోని హామీలు అమలు కాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాజీపేటలో పూర్తిస్థాయి కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, పెండింగ్ రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు నెరవేర్చకుంటే ప్రజలు మిమ్మల్ని ద్రోహులుగా చూస్తారని విమర్శించారు. తెలంగాణను పాకిస్తాన్‌తో పోలుస్తూ, రాష్ట్రంపై వివక్ష చూపుతున్న బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.